గంగసాగర్‌లో దళితులపై దాడి అత్యంత హేయమైన చర్య: తక్షణమే నిందితులను అరెస్ట్ చేయాలి

YSR Praja News Telugu : వికారాబాద్ జిల్లా తాండూర్ డివిజన్ పరిధిలోని యాలాల మండలం గంగసాగర్ గ్రామంలో వినాయక నిమజ్జన ఊరేగింపు సందర్భంగా దళిత యువకులపై మారణాయుధాలతో దాడికి పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని ప్రజాసంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. శనివారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత దళిత యువకులను కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్, PHPS రాష్ట్ర అధ్యక్షుడు పి. ఆనంద్ కుమార్ పరామర్శించి పత్రికా ప్రకటన విడుదల చేశారు.

సంఘటన వివరాలు:

వినాయక నిమజ్జన ఊరేగింపు సందర్భంగా డీజే చందాలు, గతంలో వినాయక చవితి టవల్ కొనుగోలుకు సంబంధించిన పాత కక్షలను మనసులో పెట్టుకొని, డీజే ముందు డ్యాన్స్ చేశారనే నెపంతో కొందరు బీసీ కులానికి చెందిన వ్యక్తులు దళిత యువకులపై కులం పేరుతో దూషిస్తూ కత్తులు, మారణాయుధాలతో భౌతిక దాడికి తెగబడినట్లు నాయకులు తెలిపారు.

ఈ దాడిలో హరిజన్ శివకుమార్, దేవనూరు జగత్, అర్జున్ ఆనందం, హరిజన వీరేశం, దేవనూరు భరత్, అర్జున్ వీరప్ప, అర్జున్ భీమమ్మ తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన ఈసారి జమలప్ప, పట్నం నర్సింహులు, కోడి అంజయ్య, కోడి హనుమంతు, ఈసరి యాదయ్య, ఈసరి వెంకటయ్య, ఈసరి శ్రీకాంత్, మధుపల్లి నర్సిములు, మద్దులపల్లి శ్రీనివాస్, సర్పంచ్ మదులపల్లి మల్లేశం, చిగుర్లపల్లి అనంతయ్య, చిగుర్లపల్లి బాలరాజ్, చిగుర్లపల్లి ప్రసాద్, ఈసరి అంజయ్య, కిష్టాపురం నరసింహులు తదితర 15 మంది ఈ దాడిలో పాల్గొన్నారని నాయకులు పేర్కొన్నారు.

పోలీసుల తీరుపై అసంతృప్తి – ప్రజాసంఘాల డిమాండ్లు:

ఘటన జరిగిన వెంటనే అర్ధరాత్రి 12 గంటలకే బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటివరకు స్థానిక ఎస్ఐ, సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులు గ్రామాన్ని సందర్శించకపోవడం శోచనీయమని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని హెచ్చరిస్తూ పలు డిమాండ్లను లేవనెత్తారు:

కఠిన చర్యలు & అరెస్టులు: దళిత కుటుంబాలపై దాడికి పాల్పడిన 15 మంది నిందితులపై తక్షణమే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, వారిని వెంటనే అరెస్ట్ చేయాలి.

ఉచిత వైద్యం & పరిహారం: గాయపడిన బాధితులకు ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందించడంతో పాటు తగిన ఆర్థిక పరిహారం చెల్లించాలి.

బాధిత కుటుంబాలకు రక్షణ: గంగసాగర్ గ్రామంలో తదుపరి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా బాధిత దళిత కుటుంబాలకు పోలీసు రక్షణ కల్పించాలి.

నిష్పక్షపాత విచారణ: ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలి.

సమాజంలో కుల వివక్షకు స్థానం లేదని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ దళితుల హక్కులను భంగపరిచే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు వ్యతిరేక పోరాట సంఘాల ఆధ్వర్యంలో ఉధృత ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో PHPS జిల్లా ఇన్చార్జ్ మల్లేశం, బాధిత గ్రామ యువకులు శివకుమార్, జగత్, నందు, ఆనంద్, వీరేశం, భరత్ తదితరులు పాల్గొన్నారు.