New UPI Charges యూపీఐ లావాదేవీలపై కొత్త ఛార్జీల బాదుడు: క్యూఆర్ కోడ్లు పీకేస్తున్న వ్యాపారులు, మండిపడుతున్న ప్రజలు
వైయస్సార్ ప్రజా న్యూస్ ప్రతినిధి ఎండీ గౌస్ వైఎస్ఆర్ : గత కొన్నేళ్లుగా భారతదేశంలో డిజిటల్ విప్లవానికి మారుపేరుగా నిలిచింది ‘యూపీఐ’ (UPI). జేబులో పర్సు లేకపోయినా, చేతిలో స్మార్ట్ఫోన్ ఉంటే చాలు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు టీ కొట్టు దగ్గర నుంచి కిరాణా షాపు వరకు ఎలాంటి చిల్లర కష్టాలు లేకుండా లావాదేవీలు జరిగిపోతున్నాయి. అయితే, డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడిన సామాన్యులకు మరియు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. అక్టోబర్ 15 నుంచి యూపీఐ లావాదేవీలపై కొత్త ఛార్జీలు అమలు చేయనున్నట్లు వచ్చిన నిబంధనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.
కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి?
తాజా రూల్స్ ప్రకారం, అక్టోబర్ 15 నుంచి యూపీఐ ద్వారా రూ. 1999 (అంటే రూ. 2000 అంతకంటే ఎక్కువ) చెల్లింపులు చేస్తే, ఆ లావాదేవీపై 0.4 శాతం ఛార్జీలు వసూలు చేయనున్నారు. రూ. 2000 లోపు చేసే చెల్లింపులకు ఎలాంటి ఛార్జీలు ఉండవని స్పష్టం చేశారు. అయితే ఈ ఛార్జీలు సామాన్య ప్రజలు (వినియోగదారులు) చెల్లించాల్సిన అవసరం లేదని, కేవలం పేమెంట్స్ స్వీకరించే మర్చంట్స్ (వ్యాపారస్తులు) మాత్రమే ఈ 0.4 శాతం భారాన్ని భరించాలని ప్రభుత్వం చెబుతోంది.
ప్రభుత్వ వాదనను ఖండిస్తున్న ప్రజలు
ప్రభుత్వం ఈ ఛార్జీలను వ్యాపారుల ఖాతాల్లో వేసినప్పటికీ, సామాన్య ప్రజలు మాత్రం తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఉప్పు, పప్పు మీద పన్నులు కడుతూ బతుకుతున్న సామాన్యుడిపై ఇప్పుడు ఈ రూపంలో మరో భారం పడనుందని మండిపడుతున్నారు. క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేసినప్పుడు వ్యాపారులు ఆ ఛార్జీలను వినియోగదారుల బిల్లుకే కలిపి వసూలు చేసిన చరిత్ర మన ముందు ఉంది. ఇప్పుడు యూపీఐ ఛార్జీలను కూడా వ్యాపారులు తమ జేబుల్లోంచి కట్టరని, ఆ వంకతో వస్తువుల ధరలు పెంచడమో లేదా అదనపు ఛార్జీల పేరుతో కస్టమర్ల నుంచే ముక్కుపిండి వసూలు చేస్తారని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్నది ఒకటైతే, క్షేత్రస్థాయిలో జరిగేది మరొకటని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చిన్న వ్యాపారుల ఆవేదన
ఈ కొత్త నిబంధనలపై చిన్న, సన్నకారు వ్యాపారులు, కిరాణా షాపుల యజమానులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కార్పొరేట్ మాల్స్, పెద్దపెద్ద షోరూంలకు లాభాల శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారు ఈ ఛార్జీలను భరించగలరు. కానీ, ఒక చిన్న కిరాణా షాపులో రూ. 2000 విలువైన బియ్యం బస్తా లేదా నూనె డబ్బా అమ్మితే వచ్చే లాభం పది లేదా ఇరవై రూపాయలు మాత్రమే ఉంటుంది. అందులోంచి మళ్లీ 0.4 శాతం యూపీఐ ఛార్జీల కింద కట్ అయితే తమకు మిగిలేది ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. లాభాలు తక్కువగా ఉండే తమ లాంటి చిన్న వ్యాపారుల వద్ద ఈ యూపీఐ ఛార్జీలు వసూలు చేయడం అన్యాయమని వారు వాపోతున్నారు.
మళ్లీ క్యాష్ వైపు అడుగులు.. బోర్డులు తీసేస్తున్న వ్యాపారులు
ఈ ఛార్జీల భారం మోయలేక చాలా మంది వ్యాపారులు అప్పుడే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అక్టోబర్ 15 సమీపిస్తున్న కొద్దీ, కిరాణా షాపులు, బట్టల దుకాణాలు, హోటళ్లలో కౌంటర్ల ముందు ఉండే గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి క్యూఆర్ (QR) కోడ్ స్కానర్లను వ్యాపారులు తీసివేస్తున్నారు. “మా వద్ద ఆన్లైన్ పేమెంట్స్ పనిచేయవు.. కేవలం క్యాష్ మాత్రమే ఇవ్వండి” అని బోర్డులు పెడుతున్నారు. ఒకవేళ రూ. 2000 కు పైగా బిల్లు అయితే, కచ్చితంగా నగదు రూపంలోనే లావాదేవీలు సాగిస్తున్నారు. దీంతో డిజిటల్ చెల్లింపుల వల్ల చిల్లర కష్టాలు తీరాయని సంతోషించిన కస్టమర్లు, ఇప్పుడు వ్యాపారులు నగదు అడుగుతుండటంతో మళ్లీ ఏటీఎంల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తోందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
వెనక్కి తీసుకోవాలని డిమాండ్
భారతదేశంలో ‘డిజిటల్ ఇండియా’ విజయవంతం కావడానికి ప్రధాన కారణం లావాదేవీలు ఉచితంగా జరగడమే. ఇప్పుడు దీనిపై ఛార్జీలు వేయడం ద్వారా డిజిటల్ ఎకానమీ మళ్లీ వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మళ్లీ నగదు లావాదేవీలు పెరిగితే పారదర్శకత లోపించి, నల్లధనం పెరిగే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వినియోగదారులు, వ్యాపారులు ఇద్దరికీ నష్టం చేకూర్చే ఈ 0.4 శాతం ఛార్జీల నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని దేశవ్యాప్తంగా సామాన్యులు, వ్యాపార వర్గాలు ముక్తకంఠంతో కోరుతున్నాయి.




