YSR Praja News Telugu : జనగామ: స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో తనతో తేల్చుకోవాలని ఆయన బహిరంగ సవాల్ విసిరారు. బుధవారం జనగామలో మీడియాతో మాట్లాడిన రాజయ్య.. కడియం తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఇప్పటికే దానం నాగేందర్ వికెట్ పడిపోయిందని, తదుపరి పడే రెండో వికెట్ కడియం శ్రీహరిదేనని రాజయ్య వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఆయన రాజకీయ సమాధి ఖాయమని హెచ్చరించారు. “సర్వేలు అన్నీ నీకు అనుకూలంగా ఉన్నాయని అంటున్నావు కదా.. దమ్ముంటే రాజీనామా చేసి రా, ఉప ఎన్నికల్లో చూసుకుందాం” అని సవాల్ చేశారు.
ఇద్దరి రాజకీయ నేపథ్యాలను ప్రస్తావిస్తూ.. “నువ్వు నాలుగు సార్లు, నేను నాలుగు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచాం. ఇద్దరం మాజీ ఉప ముఖ్యమంత్రులమే. కానీ, నాది ప్రజా బలం.. నీది కుట్రలు, కుతంత్రాల రాజకీయం” అని రాజయ్య విమర్శించారు.
కడియం శ్రీహరి తన కూతురుతో కలిసి పదేపదే ఢిల్లీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు వెళ్తున్నారని, అది నియోజకవర్గ అభివృద్ధి కోసం కాదని, కేవలం మంత్రి పదవి కోసం వేస్తున్న చక్కర్లు అని రాజయ్య ఆరోపించారు. “కడియం శ్రీహరి రాసి పెట్టుకో.. ఇక నీ జీవితంలో మంత్రిని కాలేవు” అని ఘాటుగా స్పందించారు. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిపై దమ్ముంటే అంబేద్కర్ విగ్రహం వద్ద కడియం శ్రీహరి శ్వేతపత్రం విడుదల చేయాలని ఈ సందర్భంగా రాజయ్య డిమాండ్ చేశారు.




