విచారణ పేరుతో పోలీసుల థర్డ్ డిగ్రీ..? భయంతో ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య!
- జహీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
- అంధురాలైన తల్లికి దూరమైన పెద్దదిక్కు
- పోలీసుల తీరుపై ఎమ్మెల్యే మాణిక్ రావు ఆందోళన.. బీఆర్ఎస్ నేతల అరెస్ట్
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విచారణ పేరుతో పోలీసులు చితకబాదడంతో ఆ దెబ్బలకు తాళలేక, మళ్లీ స్టేషన్‌కు వెళితే ఇంకెంత కొడతారో అన్న భయంతో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బిలాల్ పూర్ గ్రామంలో కలకలం రేపింది. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగడంతో జహీరాబాద్‌లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
అసలేం జరిగిందంటే..
కోహీర్ మండలం బిలాల్ పూర్ గ్రామానికి చెందిన శేఖర్ (30) అనే యువకుడిని ఓ బంగారం చోరీ కేసులో నిందితుడిగా అనుమానిస్తూ సోమవారం జహీరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తీసుకెళ్లిన అనంతరం విచారణ పేరుతో శేఖర్‌ను విచక్షణా రహితంగా, కనీసం నడవలేని స్థితికి చేరేలా లాఠీలతో తీవ్రంగా కొట్టినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. శేఖర్‌ను పోలీసులు తీసుకెళ్లిన విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. కోహీర్ మాజీ జెడ్పీటీసీ నరసింహులుకు సమాచారం అందించారు. ఆయన సోమవారం రాత్రి 11 గంటల సమయంలో జహీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, పోలీసులతో మాట్లాడి షూరిటీ ఇచ్చి శేఖర్‌ను విడిపించి ఇంటికి తీసుకొచ్చారు.
మళ్లీ రమ్మనడంతో భయపడి..
షూరిటీపై శేఖర్‌ను పంపించే సమయంలో, మంగళవారం ఉదయం మళ్లీ పోలీస్ స్టేషన్‌కు తీసుకురావాలని పోలీసులు ఆదేశించారు. అప్పటికే పోలీసుల దెబ్బలతో తీవ్రంగా గాయపడి బాధతో ఉన్న శేఖర్.. మళ్లీ స్టేషన్‌కు వెళితే తనను ఇంకెంతలా చితకబాదుతారోనని మనస్తాపానికి గురయ్యాడు. అదే భయంతో మంగళవారం ఉదయం తన ఇంట్లోనే ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మృతుడికి కంటి చూపు లేని ఓ వృద్ధ తల్లి, ఒక తమ్ముడు ఉన్నారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉంటూ పోషణ భారం మోస్తున్న శేఖర్ మృతి చెందడంతో ఆ ఇంట రోదనలు మిన్నంటాయి.
పోలీసులు కొట్టలేదు: డీఎస్పీ సైదా నాయక్
ఈ ఘటనపై జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్ వివరణ ఇచ్చారు. ఓ దొంగతనం కేసులో అనుమానంతో శేఖర్‌ను విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చిన మాట వాస్తవమేనని, అయితే మాజీ జెడ్పీటీసీ నరసింహులు షూరిటీ ఇవ్వడంతో పంపించేశామని తెలిపారు. అయితే, శేఖర్‌ను పోలీసులు కొట్టారన్న ఆరోపణలను డీఎస్పీ పూర్తిగా ఖండించారు.
ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆందోళన
పోలీసులు విచక్షణా రహితంగా కొట్టడం వల్లే శేఖర్ మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు ఆరోపించారు. శేఖర్‌ను కొట్టిన ఎస్సైతో పాటు బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి జహీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆయన ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. ధర్నా నిర్వహిస్తున్న ఎమ్మెల్యే మాణిక్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకుని సమీపంలోని వస్తాపూర్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.




