​సీఎం రేవంత్ సోదరుడి కనుసన్నల్లో ముస్లిం కుటుంబంపై దౌర్జన్యం: అబ్దుల్ వాహబ్ ఆగ్రహం

YSR Praja News Telugu : సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి కనుసన్నల్లో ముస్లిం కుటుంబంపై దౌర్జన్యం!

మహిళలను బయటికి లాగి హింసించడం అత్యంత అమానుషం: అబ్దుల్ వాహబ్ తీవ్ర ఆగ్రహం

ఫుడ్ సేఫ్టీ అధికారులతో బెదిరింపులు.. రాత్రికి రాత్రే జేసీబీలతో హోటల్ ధ్వంసం

బాధితులకు న్యాయం చేయకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు తప్పవని హెచ్చరిక

హైదరాబాద్:

రాష్ట్రంలో అధికార బలంతో ముఖ్యమంత్రి బంధువులు అరాచకాలకు పాల్పడుతున్నారని, సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల తిరుపతి రెడ్డి కనుసన్నల్లోనే మాదాపూర్‌లో ఓ ముస్లిం కుటుంబానికి చెందిన హోటల్‌పై దౌర్జన్యం జరిగిందని తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు, వక్ఫ్ బచావో తహ్రీక్ జేఏసీ కన్వీనర్ అబ్దుల్ వాహబ్ తీవ్రంగా మండిపడ్డారు. మాదాపూర్‌లోని ‘లక్కీ రెస్టారెంట్’ యజమానులపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై ఆయన నిప్పులు చెరిగారు.

మహిళల పట్ల అత్యంత అమానుషం

మాదాపూర్‌లో ఎన్నో ఏళ్లుగా లక్కీ రెస్టారెంట్ నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్న ముస్లిం కుటుంబంపై భౌతిక దాడికి దిగడం హేయమైన చర్య అని అబ్దుల్ వాహబ్ అన్నారు. వ్యాపారం చేసుకుంటున్న చోట కనీసం మహిళలు అని కూడా చూడకుండా, వారిని బయటికి లాగి దుర్భాషలాడుతూ హింసించడం అమానుషమన్నారు. కుటుంబ సభ్యుల పట్ల ఇంత క్రూరంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యంలో ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫుడ్ సేఫ్టీ శాఖ పేరుతో బెదిరింపుల పర్వం

తమకు నచ్చిన, తమ కన్ను పడిన ఆస్తులను బలవంతంగా లాక్కోవడానికి సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ‘ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌’ను ఓ ఆయుధంగా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. మొదట నిబంధనల పేరుతో అధికారుల ద్వారా నోటీసులు ఇప్పించి, హోటళ్లను సీజ్ చేయిస్తున్నారని, ఆ తర్వాత యజమానులను బెదిరించి ఆస్తులు లాక్కునే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.

కక్షపూరితంగానే జేసీబీలతో ధ్వంసం

లక్కీ రెస్టారెంట్ యజమానులు తమ హోటల్‌ను అప్పగించడానికి నిరాకరించడంతోనే ఈ కక్షపూరిత దాడులకు దిగారని అబ్దుల్ వాహబ్ ధ్వజమెత్తారు. ఉద్దేశపూర్వకంగా అధికారులతో హోటల్‌ను సీజ్ చేయించడమే కాకుండా, రాత్రికి రాత్రే జేసీబీ (JCB) యంత్రాలతో హోటల్ ముందు భాగాన్ని ధ్వంసం చేయడం రాష్ట్రంలో సాగుతున్న రాక్షస పాలనకు నిదర్శనమన్నారు. మైనార్టీలు, పేదలు కష్టపడి నడుపుకుంటున్న వ్యాపారాలను టార్గెట్ చేసి భయాందోళనకు గురిచేస్తే మైనార్టీ సంఘాలు చూస్తూ ఊరుకోబోవని హెచ్చరించారు.

కఠిన చర్యలు తీసుకోకుంటే న్యాయపోరాటం

దౌర్జన్యానికి గురైన బాధిత ముస్లిం కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని అబ్దుల్ వాహబ్ డిమాండ్ చేశారు. మహిళలపై దాడి చేసి, ఆస్తులను ధ్వంసం చేసిన నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరగని పక్షంలో, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మైనార్టీ సంఘాలను ఏకం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.