కొడంగల్ మున్సిపల్ ఎన్నికల్లో మైనార్టీ రిజర్వేషన్లు – 12% కోటా, చైర్మన్ పదవి డిమాండ్

YSR Praja News Telugu : కొడంగల్:

రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మైనార్టీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి (TSMHPS) రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అబ్దుల్ వహాబ్ తీవ్రంగా డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో మైనార్టీలు కీలక పాత్ర పోషించారని గుర్తు చేసిన ఆయన, ఇప్పుడు ఆ వర్గాలకు రాజకీయంగా సముచిత వాటా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడమే నిజమైన ప్రజాపాలన అని ఆయన వ్యాఖ్యానించారు.

“సామాజిక న్యాయం” అనే నినాదంతో పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి గారు, ముందుగా తమ సొంత నియోజకవర్గం నుంచే ఆచరణకు నాంది పలకాలని అబ్దుల్ వహాబ్ హితవు పలికారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే మైనార్టీలకు న్యాయం జరగకపోతే, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు.

కొడంగల్, కోస్గి, మద్దూర్ మున్సిపాలిటీల్లో మైనార్టీల జనాభా గణాంకాలను పరిగణనలోకి తీసుకుని కౌన్సిలర్ స్థానాల్లో కనీసం 12 శాతం రిజర్వేషన్ కేటాయించాలని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా ఈ మూడు మున్సిపాలిటీలలో కనీసం ఒక మున్సిపల్ చైర్మన్ పదవిని మైనార్టీలకు కేటాయించి, రాజకీయంగా వారికి గౌరవప్రదమైన స్థానం కల్పించాలని కోరారు.

మైనార్టీలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించడం వల్ల స్థానిక పాలన మరింత బలోపేతమవుతుందని, ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని అబ్దుల్ వహాబ్ అభిప్రాయపడ్డారు. ఇది కేవలం ఒక వర్గానికి మేలు చేయడం కాదని, సమాజంలో సమానత్వం, సమన్యాయం నెలకొల్పే దిశగా తీసుకునే కీలక నిర్ణయమని అన్నారు.

ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకుని, తమ సొంత నియోజకవర్గంలో మైనార్టీలకు రాజకీయ వాటా దక్కేలా తక్షణ చర్యలు చేపట్టాలని TSMHPS తరఫున డిమాండ్ చేస్తున్నామని అబ్దుల్ వహాబ్ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *