మహిళలు పిల్లలు కనే యంత్రాలా? ముఖ్యమంత్రిపై వైఎస్ జగన్ ఫైర్!

YSR Praja News Telugu : తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ల తీరుపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యంత ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా లోకేష్ తన సభల్లో పదే పదే చెబుతున్న “Both are not same” (ఇద్దరూ ఒక్కటి కాదు) అనే డైలాగ్‌ను వైఎస్ జగన్ తనదైన శైలిలో తిప్పికొట్టారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్సార్సీపీ సుపరిపాలనకు, ప్రస్తుత కూటమి ప్రభుత్వ విధానాలకు మధ్య ఉన్న స్పష్టమైన వ్యత్యాసాన్ని వివరిస్తూ పదునైన విమర్శలు గుప్పించారు.

వెన్నుపోటు మీ చరిత్ర.. ప్రజా మద్దతు మా చరిత్ర

“మిస్టర్ లోకేష్.. అవును, మన ఇద్దరం ఎప్పటికీ ఒక్కటి కాలేము” అంటూ జగన్ విరుచుకుపడ్డారు. వెన్నుపోటు పొడిచి పార్టీని, పార్టీ గుర్తును లాక్కోవడం టీడీపీ చరిత్ర అని, కానీ ప్రజల మద్దతు కూడగట్టుకుని, ఎదురొడ్డి నిలబడి అధికారంలోకి రావడం తమ చరిత్ర అని స్పష్టం చేశారు.

క్యారెక్టర్: ప్రజలను మోసం చేయడం, నమ్మించి ముంచడం టీడీపీ నైజమని, ఆరు నూరైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం తమ క్యారెక్టర్ అని ఆయన ఉద్ఘాటించారు.

స్టైల్: పనులు చేసి చూపించడం వైఎస్సార్సీపీ స్టైల్ అయితే, పబ్లిసిటీతో ఇతరుల క్రెడిట్ దొంగిలించడం కూటమి స్టైల్ అని విమర్శించారు. అందుకే “Both can never be same” అని స్పష్టం చేశారు.

మాది సంక్షేమ పాలన.. మీది అప్పుల పాలన

గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిందన్నారు. మహిళా సాధికారత, ‘దిశ’ యాప్ ద్వారా మహిళా రక్షణ, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల చెంతకే పాలన అందించామని గుర్తు చేశారు. అర్హులైన పేదలకు ఎక్కడా అవినీతికి తావులేకుండా డీబీటీ (Direct Benefit Transfer) ద్వారా రూ.2.73 లక్షల కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశామన్నారు.

కానీ ప్రస్తుత ప్రభుత్వం రెండేళ్లలోనే రూ.3.6 లక్షల కోట్లు అప్పులు చేసి, ఎన్నికల ముందు ఇచ్చిన ‘సూపర్ సిక్స్’, ‘సూపర్ సెవెన్’ హామీలను గాలికి వదిలేసిందని ఆరోపించారు. తమ హయాంలో తెచ్చిన మంచి పథకాలను నాశనం చేయడమే ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యంగా మారిందని మండిపడ్డారు.

చంద్రబాబూ.. మీరెందుకు ఒక్కరితోనే ఆపేశారు?

చంద్రబాబు నాయుడు ఇటీవల చేసిన ‘సంతానమే సంపద’ వ్యాఖ్యలపై వైఎస్ జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు ముగ్గురు, నలుగురు పిల్లలను కనాలని, అలా కన్నవారికి డబ్బులు ఇస్తానని చెప్పడం హాస్యాస్పదమన్నారు. “ముగ్గురు, నలుగురిని కనమని చెబుతున్న చంద్రబాబు.. మరి తానెందుకు ఒక్కరితోనే ఆపేశారు? ఆయన కొడుకు లోకేష్ ఎందుకు ఒక్కరితోనే సరిపెట్టుకున్నారు? ముందు మీరు చెప్పేది మీ కుటుంబంలో పాటించాలి కదా?” అని సూటిగా ప్రశ్నించారు.

మహిళలు పిల్లలు కనే యంత్రాలు కారు

ప్రభుత్వం బాధ్యతగా అందించాల్సిన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను చంద్రబాబు పూర్తిగా గాలికొదిలేశారని జగన్ విమర్శించారు. పేదలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలకు, నాడు-నేడు ద్వారా స్కూళ్ల అభివృద్ధికి నిధులు ఇవ్వడానికి మనసు రాని చంద్రబాబుకు.. అమరావతిలో భవనాల అద్దాల కోసం రూ.2,540 కోట్లు ఖర్చు చేయడానికి మాత్రం చేతులు వస్తున్నాయని ఎద్దేవా చేశారు.

ముగ్గురు, నలుగురు పిల్లలను కనాలని ఉచిత సలహాలు ఇస్తున్న ముఖ్యమంత్రి.. పేద కుటుంబాలకు వారికి కనీసం మంచి భోజనం పెట్టే పరిస్థితి ఉందా అని ఆలోచించరా అని నిలదీశారు. ఆ పిల్లల చదువులు, నాణ్యమైన వైద్యం ఎలా అందుతాయని ప్రశ్నించారు. మహిళలను కేవలం పిల్లలను కనే యంత్రాలుగా చూడటం, వారిని చులకన చేయడం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయన్న కనీస స్పృహ ప్రభుత్వానికి ఉండాలని హితవు పలికారు.