YSR Praja News Telugu : తాడేపల్లి: కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)లో కమిషనర్ల మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా నిలబడాలంటే ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ బద్ధ సంస్థలపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉండాలని స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.
పది నెలల్లో 14 సార్లు అభ్యంతరాలు!
ఓటర్ల జాబితాల నిర్వహణతో సహా అనేక కీలక అంశాల్లో కమిషనర్ల మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు జాతీయ మీడియాలో వచ్చిన కథనాలను వైఎస్ జగన్ ప్రస్తావించారు.
గత పది నెలల కాలంలోనే దాదాపు 14 సందర్భాల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని తెలిపారు.
నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నామని ఈసీ చెప్తున్నప్పటికీ, ప్రజల్లో తలెత్తిన సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపైనే ఉందన్నారు.
ఏయే అంశాలపై అభ్యంతరాలు నమోదయ్యాయి? వాటిపై తీసుకున్న చర్యలేమిటి? ఓటర్ల జాబితా చేర్పులు, తొలగింపుల్లో క్షేత్రస్థాయి అధికారుల స్వతంత్రత ఎంత? అనే విషయాలపై పారదర్శకత ఉండాలని డిమాండ్ చేశారు.
ఈసీ నియామకాల్లో మార్పులు అవసరం
2023లో తీసుకొచ్చిన ఎన్నికల కమిషనర్ల నియామక చట్టాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందన్న జగన్, సుప్రీంకోర్టు సీజేఐ భాగస్వామ్యంతో కూడిన పాత విధానాన్ని తిరిగి తీసుకురావాలని సూచించారు.
“పరీక్ష రాసే విద్యార్థే తమకు పరీక్ష పెట్టే వారిని నియమించే పరిస్థితి ఉంటే.. ఆ వ్యక్తి ఎంత నిజాయితీపరుడైనా అనుమానాలకు తావిస్తుంది. అందుకే నియామకాలు పూర్తి పారదర్శకంగా ఉండాలి.” — వైఎస్ జగన్
ఎన్నికల కమిషనర్ల నియామకానికి ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI), లోక్ సభ ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉండే ముగ్గురు సభ్యుల కమిటీ విధానాన్ని పునరుద్ధరించేలా చట్టసవరణ చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్లో అభ్యంతరాలను పట్టించుకోలేదు
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తూ ఈసీ పనితీరుపై జగన్ విమర్శలు గుప్పించారు:
SIR ప్రక్రియ: ఏపీలో SIR ప్రక్రియ సందర్భంగా ప్రతిపక్షంగా తాము లేవనెత్తిన అనేక అభ్యంతరాలపై ఈసీ నుంచి సరైన స్పందన రాలేదని ఆరోపించారు.
డీలిమిటేషన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డులు, డివిజన్ల పునర్విభజనపై వ్యక్తంచేసిన అభ్యంతరాలను సైతం పరిగణనలోకి తీసుకోకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో పారదర్శకత ఉండటమే కాకుండా, అది ఉందనే నమ్మకం ప్రజల్లో కలగాలని, ప్రతి అర్హులైన పౌరుడి ఓటు హక్కును కాపాడటమే ఎన్నికల వ్యవస్థ ముందున్న ప్రధాన బాధ్యతని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.




