
YSR Praja News : ప్రభుత్వ ఉపాధ్యాయుడు సయ్యద్ ఖలీల్ పాషా నిలిపివేసిన వేతనం, ఇంక్రిమెంట్లు వెంటనే విడుదల చేయాలి
– అబ్దుల్ వహబ్, తెలంగాణ స్టేట్ మైనారిటీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు
వికారాబాద్ జిల్లా తాండూర్ మండల కేంద్రంలో ఆదివారం తెలంగాణ స్టేట్ మైనారిటీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు సయ్యద్ ఖలీల్ పాషా వేతనం మరియు చట్టబద్ధంగా రావలసిన ఇంక్రిమెంట్లను అన్యాయంగా నిలిపివేయడాన్ని ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించారు. ఈ సమావేశానికి సమితి రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ వహబ్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా అబ్దుల్ వహబ్ మాట్లాడుతూ, మిడ్జిల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ ఖలీల్ పాషాకు న్యాయం జరగకపోవడం బాధాకరమన్నారు. తన వేతనం, ఇంక్రిమెంట్లు విడుదల చేయాలంటూ పాఠశాల ప్రాంగణంలో టెంటు వేసి శాంతియుత నిరసన చేపట్టాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. పాఠశాల హెడ్‌మాస్టర్ మరియు సంబంధిత ఎంఈవో కావాలని వేతనాన్ని నిలిపివేస్తున్నారని ఆరోపించారు.
ఖలీల్ పాషా మాట్లాడుతూ, న్యాయం కోసం తాను చేసిన ప్రతి ప్రయత్నం విఫలమవుతుండటంతో తీవ్ర మనోవేదనకు గురయ్యానన్నారు. తనకు లభించిన సాహితీ వేత్త అవార్డును సైతం నిరసనగా తిరిగి ఇచ్చేశానని తెలిపారు. అయినప్పటికీ అధికారుల వైఖరిలో మార్పు లేకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. మైనారిటీ ఉపాధ్యాయుల పట్ల వివక్ష చూపుతూ చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
అబ్దుల్ వహబ్ మాట్లాడుతూ, నిస్వార్థంగా సేవ చేస్తున్న మైనారిటీ ఉపాధ్యాయులకు ఎక్కడ అన్యాయం జరిగినా తెలంగాణ స్టేట్ మైనారిటీ హక్కుల పోరాట సమితి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ వ్యవహారంలో తక్షణమే న్యాయం జరగకపోతే రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులను, గౌరవ ముఖ్యమంత్రిని కలిసి పిటిషన్ అందజేస్తామని తెలిపారు.
అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు కూడా సిద్ధమని హెచ్చరించారు. మైనారిటీ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ ప్రెస్‌మీట్‌లో తెలంగాణ స్టేట్ మైనారిటీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ వసీమ్, వికారాబాద్ ఆర్గనైజేషన్ సెక్రటరీ మహమ్మద్ ముస్తఫా, తాండూర్ నియోజకవర్గ అధ్యక్షుడు మొహమ్మద్ సామి, ఇన్‌చార్జ్ మొహమ్మద్ సాదిక్ సాహెబ్, తాండూర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజద్ అలీ పాషా, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫర్హాద్, వాసే, యూత్ ప్రెసిడెంట్ ఎస్‌కే గౌస్, అబ్రార్ తదితరులు పాల్గొన్నారు.




