సీఐటీయూ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే. శ్రీనివాస్ డిమాండ్

YSR Praja News Telugu : తాండూర్: సీఐటీయూ (CITU), తెలంగాణ మైనారిటీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వెనిజులాలోని వివిధ ప్రాంతాలపై అమెరికా చేపట్టిన బాంబు దాడులు, సైనిక చర్యలను సీఐటీయూ వికారాబాద్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. వెనిజులా ప్రభుత్వాన్ని అస్థిరపరచడం, అధికార మార్పు తీసుకురావడం లక్ష్యంగా గత కొన్ని వారాలుగా అమెరికా తన సైనిక, నావికా దళాలను వెనిజులా చుట్టూ సమీకరిస్తోందని పేర్కొంది.

డిసెంబర్ 2025 మొదటి వారంలో ప్రకటించిన అమెరికా జాతీయ భద్రతా వ్యూహం–2025 వెనుక ఉన్న నిజస్వరూపం ఇప్పుడు బయటపడిందని సీఐటీయూ ఆరోపించింది. పశ్చిమార్థగోళంలో అమెరికా దళాల కేంద్రీకరణ, మొత్తం ప్రాంతాన్ని తన నియంత్రణలోకి తీసుకురావాలనే ఉద్దేశ్యాన్ని అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం పొరుగుదేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని విమర్శించింది. 2017, 2018 సంవత్సరాల్లో కూడా ఇదే తరహా ప్రకటనలు వెలువడిన విషయాన్ని గుర్తుచేసింది. ముఖ్యంగా వెనిజులా, నికరాగువ, క్యూబా దేశాలపై అమెరికా దాడులకు ప్రయత్నిస్తోందని పేర్కొంది.

అమెరికా తన దురాక్రమణను వెంటనే నిలిపివేసి, కరేబియన్ సముద్రం నుంచి సైనిక దళాలన్నింటినీ ఉపసంహరించుకోవాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. లాటిన్ అమెరికాను శాంతి ప్రాంతంగా ప్రకటించాలని, సార్వభౌమ దేశాల అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోవడానికి అనుమతించకూడదని స్పష్టం చేసింది.

అమెరికా దురాక్రమణను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఒక తీర్మానాన్ని ఆమోదించాలని సీఐటీయూ కోరింది. వెనిజులాపై దాడులను వెంటనే ఆపేందుకు అమెరికాపై అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేసింది. అలాగే భారత ప్రభుత్వం కూడా ఈ దాడులను ఖండించాలని విజ్ఞప్తి చేసింది.

ఈ కార్యక్రమంలో తెలంగాణ మైనారిటీ హక్కుల పోరాట సమితి తాండూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎండీ సాధిక్, సీఐటీయూ తాండూర్ డివిజన్ నాయకులు కృష్ణ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *