ఫిబ్రవరి 12 అఖిలభారత సమ్మెకు సీఐటీయూ పిలుపు: యాలాల ఎంపీడీఓకు సమ్మె నోట్ అందజేత

YSR Praja News Telugu : యాలాల్ (వికారాబాద్ జిల్లా): కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఫిబ్రవరి 12న జరగనున్న అఖిలభారత స్థాయి సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ (CITU) నాయకులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో యాలాల్ మండలంలోని గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లి, సమ్మె నోట్‌ను అధికారికంగా అందజేశారు.

గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకు గత నాలుగు నెలలుగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని సీఐటీయూ నేతలు ఎంపీడీఓకు వివరించారు. కార్మికులకు తక్షణమే పెండింగ్ జీతాలు చెల్లించడంతో పాటు, పనికి అవసరమైన సబ్బులు, నూనెలు, గ్లౌజులు, బూట్లు అందించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి కార్మికుడికి రెండు జతల యూనిఫార్మ్‌లు ఇవ్వాలని కోరారు.

ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాల స్థానంలో తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను అమల్లోకి తీసుకువచ్చేందుకు 2025 నవంబర్ 21న జారీ చేసిన నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సవరణ చట్టం–2025ను ఉపసంహరించుకోవాలని, పేదలకు ఉపాధి కల్పించే ఎంజీఎన్ఆర్ఈజీఏ చట్టాన్ని కొనసాగించాలని కోరారు.

పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు పెంచాలని, వారికి కాటన్ బట్టలతో యూనిఫార్మ్‌లు ఇవ్వాలని సూచించారు. సామాజిక భద్రత కల్పించడంతో పాటు ప్రమాద బీమా, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో గుడ్ల సరఫరాకు అదనపు బడ్జెట్ కేటాయించాలంటూ ప్రభుత్వాన్ని కోరారు.

కార్మిక వర్గ హక్కులపై నిరంతర దాడి జరుగుతోందని, ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తోందని కే. శ్రీనివాస్ ఆరోపించారు. కార్పొరేట్ అనుకూల చట్టాలను పార్లమెంటులో సంఖ్యాబలంతో ఆమోదింపజేస్తూ కార్మికులను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెలో మండల కేంద్రాలతో పాటు జిల్లావ్యాప్తంగా కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

మధ్యాహ్న భోజన కార్మికులు, కాంట్రాక్టు మరియు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను శాశ్వతంగా నియమించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని, పీఎస్‌యూల్లో పెట్టుబడుల ఉపసంహరణను నిలిపివేయాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. జరగబోయే సార్వత్రిక సమ్మెకు అధికార యంత్రాంగం, యాజమాన్యాలు సహకరించాలని కూడా కోరారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు యు. బుగ్గప్ప, గ్రామపంచాయతీ మండల నాయకులు షబ్బీర్, మొగులయ్య, సరస్వతి, శివకుమార్, వెంకటప్ప, ఆనందం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *