రైతుల సమస్యలపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు

YSR Praja News Telugu : వైఎస్సార్ జిల్లా పులివెందులరాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం పులివెందుల నియోజకవర్గంలోని బ్రహ్మణపల్లి గ్రామంలో అరటి తోటలను ఆయన స్వయంగా పరిశీలించి, పంట నష్టాలపై రైతులను వివరంగా అడిగి తెలుసుకున్నారు.

 

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ జగన్ గత ప్రభుత్వ కాలాన్ని గుర్తు చేశారు. తమ హయాంలో అరటి పంటకు టన్నుకు సుమారు రూ.30 వేల వరకు ధర లభించిందని తెలిపారు. కరోనా వంటి క్లిష్ట సమయంలోనూ లక్షల టన్నుల అరటి పంటను విదేశాలకు ఎగుమతి చేయగలిగామని చెప్పారు. అరటి ఎగుమతుల కోసం అనంతపురం–ఢిల్లీ, తాడిపత్రి–ముంబై మార్గాల్లో ప్రత్యేక రైల్వే రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ కృషికి గాను కేంద్రం నుంచి అవార్డులు కూడా అందుకున్నామని తెలిపారు.

 

కానీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో అరటి రైతుల పరిస్థితి దిగజారిపోయిందని విమర్శించారు. ప్రస్తుతం టన్ను అరటి పంటకు రూ.2 వేల ధర కూడా లభించడం లేదని, పంట చెట్లపైనే మాగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు వ్యవసాయ రంగంలో ముందున్న రాష్ట్రం, ఇవాళ ఇంత దుస్థితికి చేరిందని ప్రశ్నించారు.

 

గత 17 నెలల పాలనలో వరుసగా ప్రకృతి విపత్తులు ఎదురైనా, రైతులకు కనీస సాయం కూడా అందలేదని విమర్శించారు. తమ పాలనలో సీజన్ ముగిసేలోపు ఇన్‌పుట్ సబ్సిడీ అందించామని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా సబ్సిడీ ఇవ్వలేదన్నారు.

 

రైతులకు ’అన్నదాత సుఖీభవ’ పథకం కింద రూ.40 వేల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, కనీసం రూ.10 వేలైనా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. నాణ్యమైన ఎరువులు కూడా బ్లాక్ మార్కెట్ ధరలకు కొనాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు.

 

ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజీలను విద్యుత్ ఆదా పేరుతో మూసివేయడంపై కూడా ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఉన్న కోల్డ్ స్టోరేజీలను కూడా సమర్థంగా వినియోగించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ హయాంలో వ్యవసాయం ఒక పండుగలా సాగిందని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ఈ రంగం తిరోగమనంలోకి వెళ్లిందని జగన్ ఆరోపించారు.

 

ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, రైతుల ఆవేదన చివరకు ప్రభుత్వాన్ని కుదిపేస్తుందని ఆయన హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *