లక్షల ఉద్యోగాల హామీ గాలిలోనే? రేవంత్ సర్కారుపై కేటీఆర్ తీవ్ర విమర్శలు, తెలంగాణ నిరుద్యోగుల్లో ఆగ్రహం

YSR Praja News Telugu : హైదరాబాద్: మరో గ్యారెంటీ హామీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గారని, దీనితో తెలంగాణ నిరుద్యోగుల్లో ఆగ్రహం తీవ్రస్థాయికి చేరుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు అది ఐదేళ్ల హామీ అంటూ మాట మార్చడాన్ని యువత తీవ్రంగా నిరసిస్తోందని ఆయన పేర్కొన్నారు.

తొలి ఏడాదిలోనే నియామకాలు చేపట్టకపోతే ప్రభుత్వాన్ని దించేయాలంటూ ఢిల్లీ నుంచి స్పష్టంగా చెప్పిన ప్రియాంక గాంధీ మాటలు అమలై ఉంటే, ఈ ప్రభుత్వం ఇప్పటికే కూలిపోయేదని కేటీఆర్ ట్వీట్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చివరి దశలో ఉన్న 65 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి ఫోటోలకు పోజులిచ్చిన సీఎం, ఆ తర్వాత పూర్తిగా చేతులెత్తేయడంతో తెలంగాణలో “రిక్రూట్‌మెంట్ జీరో” పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.

బీఆర్ఎస్ పాలనలో ఇప్పటికే లక్షా 65 వేల ఉద్యోగాలు భర్తీ చేసిన విషయాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించి, అబద్ధాల ప్రచారంతో అధికారంలోకి వచ్చారని కేటీఆర్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా, కనీసం పది వేల కొత్త ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని, దీంతో నిరుద్యోగులే కాదు వారి తల్లిదండ్రులు కూడా ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు.

జాబ్ క్యాలెండర్‌ను పక్కనపెట్టి, వరుస కుంభకోణాలతో ప్రభుత్వ పెద్దలు జేబులు నింపుకుంటున్న తీరును తెలంగాణ సమాజం నిశితంగా గమనిస్తోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రెండు లక్షల ఉద్యోగాల హామీపై మాట మార్చినంత మాత్రాన ప్రజలు మరిచిపోతారని అనుకోవడం భ్రమేనని, ముఖ్యమంత్రి చేసిన మోసానికి ప్రజల నుంచి క్షమాపణలు కోరినా సరిపోదని స్పష్టం చేశారు.

మెగా డీఎస్సీ, నిరుద్యోగ భృతి పేర్లతో నిరుద్యోగులను మోసం చేశారని, రైతుబంధు అమలులో విఫలమై లక్షలాది రైతులను నష్టపరిచారని ఆరోపించారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని చెప్పిన హామీ కూడా నెరవేరలేదని, దీంతో ఆడబిడ్డల్లో ఆగ్రహం పెరిగిందన్నారు. ఆరు గ్యారెంటీలన్నీ గారడీలేనని, ప్రజలను నయవంచన చేసిన ఈ ప్రభుత్వానికి తెలంగాణ యువత సంఘటిత శక్తి తగిన బుద్ధి చెబుతుందని కేటీఆర్ హెచ్చరించారు.

మరో గ్యారెంటీ నుంచి నిస్సిగ్గుగా తప్పించుకున్న ముఖ్యమంత్రిని చూసి తెలంగాణ నిరుద్యోగుల ఆగ్రహం రోజురోజుకూ పెరుగుతోందని, త్వరలోనే అది రాజకీయ ఉద్యమంగా మారే అవకాశాలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *