వికారాబాద్‌లో ఆశా వర్కర్ల పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి: సీఐటీయూ డిమాండ్

YSR Praja News : వికారాబాద్ :తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలకు పెండింగ్‌లో ఉన్న లెప్రసి సర్వే, పల్స్ పోలియో, సర్పంచ్ ఎన్నికల డ్యూటీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కే. శ్రీనివాస్, జిల్లా కోశాధికారి బుస్సా చంద్రయ్య డిమాండ్ చేశారు.
గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద ఆశా కార్యకర్తల బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ డీఎంహెచ్‌వోకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా కే. శ్రీనివాస్ మాట్లాడుతూ…
2022 నుంచి 2025 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం లెప్రసి సర్వే కార్యక్రమాన్ని నిర్వహించిందని, వికారాబాద్ జిల్లాలో కూడా ఆశా కార్యకర్తల చేత 15 రోజులపాటు సర్వే చేయించారని తెలిపారు. సర్వే చేసినందుకు రోజుకు ₹70 చొప్పున చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ సర్వే పూర్తై ఏడాది గడిచినా ఇప్పటివరకు డబ్బులు విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వికారాబాద్ జిల్లాలోని 20 మండలాల్లో పనిచేసిన ఆశా కార్యకర్తలకు ఒక్కొక్కరికి ₹1,050 చొప్పున బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఫిక్స్‌డ్ వేతనాలు లేక, అదనపు పని భారాలతో ఇబ్బందులు పడుతున్న ఆశా కార్యకర్తలను ప్రభుత్వం ఇలా నిర్లక్ష్యం చేయడం తగదని విమర్శించారు. తక్షణమే పెండింగ్‌లో ఉన్న లెప్రసి సర్వే నగదును ఆశా కార్యకర్తల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆశా కార్యకర్తలకు ప్రత్యేక విశ్రాంతి గదులు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. జిల్లావ్యాప్తంగా గర్భిణీ స్త్రీలను డెలివరీ కేసుల కోసం తీసుకొచ్చే సమయంలో ఆశా కార్యకర్తలు రెండు నుంచి మూడు రోజుల వరకు ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తోందని, వసతి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
కావున జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆశా కార్యకర్తల కోసం ప్రత్యేక విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ వాలంటరీ అండ్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) జిల్లా కార్యదర్శి మంగమ్మ, మాధవి, పద్మ, అనురాధ, అరుణ, కౌసల్య, జగదేవి, మునిబాయి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *