షర్మిల కోసం జగన్‌ను బలిచేస్తారా? విజయమ్మ లేఖ వెనుక టీడీపీ వ్యూహం: రాచమల్లు సంచలన వ్యాఖ్యలు

  1. షర్మిల కోసం జగన్‌ను బలిచేస్తారా? విజయమ్మ లేఖ వెనుక టీడీపీ వ్యూహం: రాచమల్లు సంచలన వ్యాఖ్యలు

YSR Praja News Telugu : ప్రొద్దుటూరు: వైఎస్ కుటుంబంలో నెలకొన్న ఆస్తుల వివాదం, రాజకీయ రచ్చపై వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. కేవలం వైఎస్ షర్మిలకు రాజకీయ, ఆర్థిక లబ్ధి చేకూర్చేందుకే వైఎస్ విజయమ్మ తన కుమారుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్యాయం చేస్తూ బహిరంగ లేఖ విడుదల చేశారని ఆయన ఆరోపించారు. కోట్లాది మంది ప్రజలు దేవుడిచ్చిన అన్నగా ఆరాధిస్తున్న జగన్‌పై, రక్తసంబంధం ఉన్న చెల్లెలు షర్మిల శత్రువుల కంటే దారుణంగా విమర్శలు చేస్తుంటే విజయమ్మ కట్టడి చేయలేకపోవడం బాధాకరమన్నారు.

నోటరీ చేయించిన లేఖ వెనుక చంద్రబాబు స్క్రిప్ట్!

విజయమ్మ లేఖ విడుదల చేసిన విధానంపై రాచమల్లు పలు కీలక అనుమానాలు వ్యక్తం చేశారు. వైఎస్సార్ భార్యగా ఆమె ఏది చెబితే ప్రజలు గుడ్డిగా నమ్ముతారనే ఉద్దేశంతోనే, ఒక వ్యూహం ప్రకారం ఆ లేఖకు నోటరీ చేయించి మరీ విడుదల చేశారని విమర్శించారు.

“ఈ లేఖ ముందుగా మీడియాకు రాలేదు. టీడీపీకి చెందిన సోషల్ మీడియా గ్రూపుల్లో దర్శనమిచ్చింది. దీన్ని బట్టి ఈ స్క్రిప్ట్ ఎక్కడ తయారవుతోంది? ఎవరు రాస్తున్నారు? అన్నది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోంది. విజయమ్మ పరోక్షంగా చంద్రబాబు ఉచ్చులో పడిపోయారు.” అని రాచమల్లు వ్యాఖ్యానించారు.

కొడుకును విలన్‌గా చిత్రీకరించడం తల్లికి తగునా?

మేనల్లుడు, మేనకోడలికి (షర్మిల పిల్లలకు) జగన్ తీవ్ర అన్యాయం చేశాడంటూ విజయమ్మ తన లేఖలో పేర్కొనడాన్ని రాచమల్లు తప్పుబట్టారు. కూతురిని రక్షించుకునే ప్రయత్నంలో, రెండు రాష్ట్రాల్లో ఎంతో గౌరవం ఉన్న కుమారుడి ఇమేజ్‌ను దిగజార్చడం ఒక తల్లికి తగదన్నారు. షర్మిల చేస్తున్న అవాస్తవ ప్రచారాన్ని అడ్డుకునేందుకే వైఎస్సార్సీపీ నేతలు వాస్తవాలు చెబుతున్నారని, దీనిని ‘గోబెల్స్ ప్రచారం’ అంటూ విజయమ్మ కొట్టిపారేయడం అన్యాయమన్నారు. ఒక తల్లిగా కుమారుడి ప్రతిష్ట కోసం ఆమె పడాల్సిన ఆరాటాన్ని, పార్టీ నాయకులుగా తాము, లక్షలాది మంది అభిమానులు పడుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు చేతిలో పావులుగా షర్మిల, సునీత

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన స్వార్థ రాజకీయాల కోసం షర్మిల, సునీతలను పావులుగా వాడుకుంటున్నారని రాచమల్లు తీవ్ర ఆరోపణలు చేశారు.

ప్రభుత్వ వైఫల్యాలు, టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారం, హెరిటేజ్ తప్పులు, డ్రగ్స్ కేసులు బయటపడిన ప్రతిసారీ ప్రజల దృష్టి మరల్చేందుకు (Diversion Politics) చంద్రబాబు వీరితో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారని విమర్శించారు.

“సునీత ప్రజలకు తెలిసి చంద్రబాబును రెండుసార్లు కలిశారు. కానీ ఎవరికీ తెలియకుండా రహస్యంగా 19 సార్లు కలిశారు. కుటుంబంలో జరిగే ప్రతి విషయాన్ని చంద్రబాబుకు చేరవేస్తున్నారు. షర్మిల ఒక్కరోజు కూడా టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించరు, ఆమె టార్గెట్ కేవలం జగన్ మాత్రమే,” అని ఆయన స్పష్టం చేశారు.

ఎన్సీఎల్టీ (NCLT) తీర్పు ఏమంటోంది? కోర్టు కేసుల వెనుక వాస్తవాలు

ఆస్తుల వివాదాన్ని చట్టబద్ధంగా తేల్చుకోవడానికే జగన్ ఎన్సీఎల్టీ కోర్టును ఆశ్రయించారని, కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడాన్ని బట్టి న్యాయం ఎవరి వైపు ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ షర్మిల మళ్లీ చెన్నై కోర్టుకు వెళ్లారని, కోర్టులో కేసు తేలేంతవరకు ఆగకుండా రోడ్డెక్కడం ఏమిటని ప్రశ్నించారు.

జగన్ బెయిల్ రద్దు చేయించే కుట్ర:

సరస్వతీ పవర్ షేర్లకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు జగన్ వద్దే ఉన్నప్పటికీ, ఈడీ (ED) అటాచ్‌మెంట్‌లో ఉన్న ఆస్తులను బదిలీ చేస్తే జగన్ బెయిల్ రద్దవుతుందని తెలిసీ, షేర్ సర్టిఫికెట్లు పోయాయంటూ తప్పుడు అఫిడవిట్ ఇచ్చి షేర్లు బదలాయించడం దారుణమన్నారు. “కొడుకు అక్రమ కేసుల్లో ఇబ్బందులు పడుతున్నాడని తెలిసి, చంద్రబాబు లాంటి వారు నాశనం చేయాలని చూస్తున్నారని తెలిసి కూడా.. కేవలం కూతురికి ఆస్తి దక్కాలన్న ఉద్దేశంతో విజయమ్మ తప్పుడు అఫిడవిట్లపై సంతకాలు చేయడం పక్షపాతం కాదా?” అని నిలదీశారు.

ఆస్తుల పంపకం ఎప్పుడో జరిగింది.. ఇవన్నీ ఇచ్చినవి కావా?

2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించడానికి ముందే కుటుంబ ఆస్తుల పంపకం జరిగిందని రాచమల్లు స్పష్టం చేశారు. షర్మిలకు వైఎస్సార్ ఎలాంటి ఆస్తులు రాసిచ్చారో విజయమ్మ తన లేఖలో అంగీకరించారని గుర్తుచేశారు.

బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని ఇల్లు, ఇడుపులపాయలో 51 ఎకరాలు.

15 మెగావాట్ల ఎస్ఆర్ఎస్ హైడ్రో పవర్ ప్రాజెక్టు, 22.5 మెగావాట్ల స్వస్తిక్ హైడ్రో పవర్ ప్రాజెక్టు.

విజయవాడ యువరాజ్ థియేటర్‌లో 35% వాటా, పులివెందులలో 7.60 ఎకరాల స్థలం.

విజయలక్ష్మి మినరల్స్ అండ్ ట్రేడింగ్ కంపెనీ 100% వాటా.

కోడూరులో రాజారెడ్డి ఆఫీసు స్థలం, శెట్టిగుంట వద్ద 90 ఎకరాల వ్యవసాయ భూమి.

ఇవన్నీ షర్మిలకు ఇచ్చినట్లు అంగీకరిస్తూనే, ఇవి పంపకాలు కావని విజయమ్మ చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఉగాది, సంక్రాంతి పండుగలకు తమాషాగా ఇచ్చిన ఆస్తులా ఇవి అని ఆయన ఎద్దేవా చేశారు.

జగన్ స్వార్జితంలో వాటాలు అడిగే హక్కు ఉందా?

వైఎస్సార్ బతికి ఉన్ననాటికే షర్మిల పెళ్లై 15 ఏళ్లు, జగన్‌కు పెళ్లై 14 ఏళ్లు అయిందని రాచమల్లు గుర్తుచేశారు.

“2009 నుంచి 2023 వరకు జగన్ తన సొంత వ్యాపారాల ద్వారా సంపాదించిన డబ్బులో నుంచి, చెల్లెలిపై ప్రేమతో అడిగినప్పుడల్లా దఫదఫాలుగా రూ.230 కోట్ల వైట్ మనీ ఇచ్చారు.”

తండ్రి సంపాదించిన ఆస్తిని అడిగే హక్కు ఎవరికైనా ఉంటుంది, కానీ ఏనాడూ పెట్టుబడులు పెట్టని, కంపెనీల కష్టనష్టాల్లో పాలుపంచుకోని, కోర్టు కేసులను పట్టించుకోని షర్మిల.. జగన్ సొంత కంపెనీల్లో వాటాలు అడగడం ఏ చట్టం ప్రకారం న్యాయమని ప్రశ్నించారు.

చంద్రబాబు సోదరి రాజ్యలక్ష్మి గానీ, వైఎస్సార్ సోదరి విమలమ్మ గానీ ఇలా అన్నల ఆస్తుల్లో వాటాలు అడిగితే ఇస్తారా అని లాజిక్ తీశారు.

2019లో జగన్ సీఎం అయ్యాక చెల్లెలిపై మమకారంతో ఎంఓయూ రాశారని, కానీ ఈడీ కేసుల వల్ల ఆస్తుల బదలాయింపు సాధ్యం కాలేదన్నారు. ఆ తర్వాత 2023 నాటికి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి, జగన్‌పై వీధిన పడి రచ్చ చేయడంతో.. ఆమె ప్రవర్తన నచ్చకే జగన్ తాను ప్రేమతో ఇవ్వాలనుకున్న ఆస్తులను రద్దు చేసుకున్నారని రాచమల్లు స్పష్టం చేశారు. ఒక తల్లిగా ఇద్దరినీ కూర్చోబెట్టి న్యాయం చేయాల్సిన విజయమ్మ, అడుగడుగునా షర్మిల వైపు నిలబడి జగన్‌ను టార్గెట్ చేయడం అత్యంత విచారకరమని ఆయన ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *