సర్పంచ్, వార్డు మెంబర్ నామినేషన్ల పరిశీలన రేపు – తప్పనిసరి పత్రాలు ఇవి

YSR Praja News : హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి దశ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శనివారంతో ముగియనుంది. ఆదివారం నామినేషన్ల పరిశీలన కోసం అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేసింది. సాయంత్రం 5 గంటల తర్వాత స్క్రూటినీ పూర్తయ్యే సరికి చెల్లుబాటయ్యే అభ్యర్థుల ప్రాథమిక జాబితాను విడుదల చేయనున్నారు.

 

తిరస్కరణకు గురైన నామినేషన్లపై అభ్యర్థులు అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారు. రిటర్నింగ్ అధికారి నిర్ణయంపై అభ్యర్థులు సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి లేదా సబ్ కలెక్టర్ వద్ద ఫిర్యాదు చేసుకోవచ్చు. పరిశీలన జరిగిన మరుసటి రోజు వరకు అప్పీలు స్వీకరిస్తారు. అప్పీలు అందిన 24 గంటల్లోనే వాటిని సంబంధిత అధికారులు పరిష్కరిస్తారు.

 

గతంలో అసంపూర్ణ సమాచారం, అవసరమైన పత్రాలు జతచేయకపోవడం, వివరాలు స్పష్టంగా ఇవ్వకపోవడం వల్ల పలువురు సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించిన సందర్భాలను అధికారులు గుర్తు చేస్తున్నారు. ఈసారి ఇలాంటి సమస్యలు లేకుండా ఉండేందుకు అభ్యర్థులు అవసరమైన డాక్యుమెంట్లు ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు.

 

అభ్యర్థులు తమ పోటీని ఉపసంహరించుకునే గడువు బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉండనుంది. ఆ తర్వాత తుది జాబితాను ప్రకటిస్తారు.

 

 

—

 

అభ్యర్థులు తప్పనిసరిగా సమర్పించాల్సిన పత్రాలు

 

తాజా గ్రామ పంచాయతీ ఓటరు జాబితా ప్రతులు లేదా అభ్యర్థి/ప్రపోజర్ పేరు జాబితాలో ఉందని అధికారిక సర్టిఫికెట్

 

అభ్యర్థి వయస్సును నిర్ధారించే పత్రాలు

 

డిపాజిట్ చెల్లింపు రసీదు

 

నామినేషన్ సమర్పించినట్లు రిటర్నింగ్ అధికారి ఇచ్చే రసీదు

 

రిజర్వ్డ్ సీట్ల (SC, ST, BC, మహిళలు) కోసం పోటీ చేసే వారి కేటగిరీకి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు

 

 

 

—

 

నామినేషన్ తిరస్కరణకు ప్రధాన కారణాలు

 

నిర్దేశిత ఫార్మాట్‌లో నామినేషన్ పత్రం సమర్పించకపోవడం

 

అభ్యర్థి లేదా ప్రతిపాదకుడు అవసరమైన సంతకాలు చేయకపోవడం

 

చట్టప్రకారం నిర్దేశించిన డిపాజిట్ మొత్తాన్ని చెల్లించకపోవడం

 

నామినేషన్ పత్రంపై ఇచ్చిన సంతకాలు సరైనవిగా లేకపోవడం

 

రిజర్వ్డ్ స్థానాలకు సంబంధించని అభ్యర్థులు అక్కడ పోటీ చేయడం

 

వార్డు మెంబర్ ప్రపోజర్ సంబంధిత వార్డులో ఓటరుగా నమోదు కాకపోవడం

 

నేరచరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలకు సంబంధించిన ఎస్ఈసీ నమూనా డిక్లరేషన్ పత్రం సమర్పించకపోవడం

 

 

ఇలాంటి లోపాలు ఉంటే పరిశీలన సమయంలో అధికారులు నామినేషన్లను తిరస్కరించే అవకాశముందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *