ED Acting as Naidu’s Tool? YSRCP MP Hits Out ఈడీ స్వతంత్ర సంస్థా? చంద్రబాబు జేబు సంస్థా?: ఎంపీ గురుమూర్తి తీవ్ర ఆగ్రహం

  • ED Acting as Naidu’s Tool? YSRCP MP Hits Out ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వ్యవహార శైలిపై వైఎస్‌ఆర్సీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈడీ అసలు స్వతంత్రంగా పనిచేస్తోందా లేక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్’ (SIT) పొడిగింపుగా, చంద్రబాబు నాయుడి ‘జేబు సంస్థ’గా మారిందా అని ప్రశ్నించారు. ఈ మేరకు పలు ప్రముఖ వార్తా సంస్థలు, జర్నలిస్టులను ట్యాగ్ చేస్తూ ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.

ఎల్లో మీడియాకే ముందుగా సమాచారమా?

ఈడీ తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు. దాడులు, నోటీసులకు సంబంధించిన వివరాలు అధికారికంగా వెలువడక ముందే ఎల్లో మీడియాలో ‘ఎక్స్‌క్లూజివ్’ కథనాలుగా ఎలా వస్తున్నాయని నిలదీశారు. ఆ వార్తలు వచ్చిన కొద్ది గంటల్లోనే ఈడీ అధికారులు కూడా సరిగ్గా అదే ప్రకారం చర్యలు చేపట్టడం చూస్తుంటే ముందస్తు ప్రణాళిక ప్రకారం జరుగుతున్న నాటకంలా ఉందన్నారు.

రాజకీయ కక్ష సాధింపు చర్యలు

మద్యం కేసుతో పాటు ఇతర కేసుల్లో చంద్రబాబు ప్రభుత్వ ‘సిట్’ రూపొందించిన స్క్రిప్టునే ఈడీ ముందుకు తీసుకెళ్తోందని గురుమూర్తి ఆరోపించారు. కేవలం వైఎస్‌ఆర్సీపీని లక్ష్యంగా చేసుకుని, ప్రతిపక్షంపై రాజకీయ కక్ష సాధించడానికే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు.

వ్యవస్థలు స్వతంత్రంగా కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తే ప్రజల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతాయని, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతోంది నిష్పాక్షిక విచారణా లేక ప్రభుత్వ ప్రాయోజిత నాటకమా? అనే ప్రశ్న తలెత్తుతోందన్నారు. దర్యాప్తు సంస్థలపై ప్రజల్లో విశ్వాసం నిలవాలంటే అవి స్వతంత్రంగా, పారదర్శకంగా వ్యవహరించాలని, రాజకీయ స్క్రిప్టులను అమలు చేస్తే ముందుగా దెబ్బతినేది ఆయా సంస్థల ప్రతిష్ఠేనని ఆయన హెచ్చరించారు.