SRH కు అదిరిపోయే శుభవార్త.. జట్టులోకి వచ్చేస్తున్న యార్కర్ల కింగ్!

  1. YSR Praja News Telugu : ఐపీఎల్ 19వ సీజన్ (IPL 2026) ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు అదిరిపోయే శుభవార్త అందింది. ఆ జట్టు స్టార్ పేసర్, శ్రీలంక ఫాస్ట్ బౌలర్ ఎషాన్ మలింగ ఎట్టకేలకు తన ఫిట్‌నెస్ టెస్టును క్లియర్ చేశాడు. దీంతో ఐపీఎల్-2026లో ఆడేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు అతనికి అధికారికంగా ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ (NOC) మంజూరు చేసింది. అడ్డంకులన్నీ తొలగిపోవడంతో మలింగ ఒకట్రెండు రోజుల్లో నేరుగా ఎస్‌ఆర్‌హెచ్ (SRH) క్యాంప్‌లో చేరనున్నాడు.
  2. గాయంతో దూరం.. అనుమానాల నడుమ ఎంట్రీ
  3. గత ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మలింగ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఆ గాయం కారణంగానే ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి కూడా దూరమయ్యాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 19వ సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు కూడా అతను దూరం కానున్నాడని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్టుగానే.. గత వారం శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షలలో దుష్మంత చమీర, పాతుమ్ నిస్సంక, కమిందు మెండిస్ లాంటి ఆటగాళ్లు ఉత్తీర్ణత సాధించినప్పటికీ.. మలింగ మాత్రం ఆ టెస్టును క్లియర్ చేయలేకపోయాడు.
  4. కమ్మిన్స్ లేని లోటును భర్తీ చేసేలా..
  5. తొలి ఫిట్‌నెస్ టెస్ట్‌లో ఫెయిల్ అవ్వడంతో టోర్నీ ఆరంభ మ్యాచ్‌లకు మలింగ దూరం కావడం ఖాయమని అంతా భావించారు. కానీ, పట్టుదలతో శ్రమించిన అతడు తాజాగా నిర్వహించిన తుది ఫిట్‌నెస్ పరీక్షలో సక్సెస్ అయ్యాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించి ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ దళాన్ని బలోపేతం చేసేందుకు సిద్ధమయ్యాడు. గత సీజన్‌లో కేవలం 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన మలింగ.. ఏకంగా 13 వికెట్లు పడగొట్టి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. తన కచ్చితమైన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించాడు. వెన్ను గాయం కారణంగా స్టార్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్న నేపథ్యంలో.. మలింగ రాక సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగానికి కొండంత అండగా మారనుంది.
  6. ఆ ముగ్గురు స్టార్ల పరిస్థితి ఏంటి?
  7. మరోవైపు, ఐపీఎల్‌లో వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతర శ్రీలంక స్టార్ ఆటగాళ్లు వనిందు హసరంగ (లక్నో సూపర్ జెయింట్స్), మతీష పతిరణ (కోల్‌కతా నైట్ రైడర్స్), నువాన్ తుషార (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) ఇంకా ఫిట్‌నెస్ టెస్టును క్లియర్ చేయాల్సి ఉంది. వీరు కూడా త్వరలో ఫిట్‌నెస్ సాధిస్తారని ఆయా ఫ్రాంచైజీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. కాగా, క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్-2026 మహా సంగ్రామం మార్చి 28 నుంచి అట్టహాసంగా ప్రారంభం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *