YSR Praja News Telugu : వికారాబాద్/మొయినాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రాజెక్టుల పేరిట రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని, బాధితులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) స్పష్టం చేశారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ అధ్యక్షతన జరిగిన పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
పోలీసులారా ఖబడ్డార్.. వడ్డీతో సహా చెల్లిస్తాం!
సమవేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. స్పీకర్ ప్రసాద్ కుమార్ పోలీసులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా పోలీసులను హెచ్చరిస్తూ..
“పోలీసులారా ఖబడ్డార్.. వచ్చేది మా ప్రభుత్వమే. మా నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మేము మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాం. చట్టాన్ని ఉల్లంఘించి వేధింపులకు గురిచేసే అధికారులకు భవిష్యత్తులో అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం” అని హెచ్చరించారు.
సీఎం వ్యాఖ్యలపై ఎద్దేవా
ప్రభుత్వ వైఫల్యాలపై సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తే వింత సమాధానాలు ఇస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. “ఎంత మొగోడైనా మూడు నెలల్లో పిల్లలను పుట్టిస్తారా” అని సీఎం అంటున్నారని, మూడు నెలల్లో పిల్లలు పుట్టరనే విషయం అందరికీ తెలుసని, కానీ ముప్పై నెలలు అయినా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఏమనాలో ప్రజలే చెప్పాలని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
దామగుండం అడవులు నేవీకి ధారాదత్తం.. మోదీకి రేవంత్ భయం
సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ అంటే భయమని, అందుకే ఢిల్లీ పెద్దలు ఏం చెప్తే దానికి ‘జీ హుజూర్’ అంటున్నారని కేటీఆర్ ఆరోపించారు.
బడేభాయ్ – చోటాభాయ్: ప్రధాని మోదీ (బడేభాయ్) అడగ్గానే రేవంత్ రెడ్డి (చోటాభాయ్) వికారాబాద్‌లోని దామగుండం అడవికి చెందిన 2,700 ఎకరాల భూమిని నేవీ ప్రాజెక్టుకు రాసిచ్చారని మండిపడ్డారు.
నాడు అడ్డుకున్న కేసీఆర్: గతంలో తమ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పర్యావరణాన్ని, అడవులను కాపాడటం కోసం మోదీ నిర్ణయాన్ని అడ్డుకున్నామని కేటీఆర్ గుర్తుచేశారు.
బీజేపీ, కాంగ్రెస్ అక్రమ పొత్తులు
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత మీనాక్షినటరాజన్ అభ్యర్థిత్వాన్ని నాశనం చేసింది ముమ్మాటికీ సీఎం రేవంత్ రెడ్డేనని, బీజేపీ-కాంగ్రెస్ మధ్య ఉన్న అక్రమ పొత్తులు దీని ద్వారా అందరికీ అర్థమవుతున్నాయన్నారు. దేశంలో ఓట్లు తొలగించి పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీని బీజేపీ ఇబ్బంది పెట్టిందని, ఏపీలోనూ చంద్రబాబు నాయుడు ఇదే వ్యూహంతో వైఎస్సార్సీపీని ఓడించారని ఆరోపించారు. ‘రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి’ అనే నినాదంతో ప్రతి ఒక్కరూ బూత్ స్థాయి నుంచి గట్టిగా పనిచేస్తే బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్. ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, నాగేందర్‌గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కేటీఆర్-జగన్ ఫొటో
కేటీఆర్ వికారాబాద్ పర్యటనలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్ కలిసి ఉన్న ఒక ఫొటో ఈ పర్యటనలో హల్చల్ చేసింది. కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఒక అభిమాని వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోను ప్రదర్శించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ దృశ్యం ప్రధాన మీడియాలో సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలవడమే కాకుండా, సభకు వచ్చిన వారిలో ఆసక్తిని రేకెత్తించింది.
అమరవీరుడు, కార్యకర్త కుటుంబాలకు పరామర్శ
వికారాబాద్ పర్యటన అనంతరం కేటీఆర్ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారానికి చేరుకున్నారు. అక్కడ తెలంగాణ అమరవీరుడు మందడి యాదిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం, ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఎనికేపల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త డప్పు కరంచంద్ కుటుంబాన్ని కలిసి వారిని ఓదార్చారు. పార్టీ పరంగా బాధితులకు అన్ని విధాలా అండగా ఉండి ఆదుకుంటామని ఈ సందర్భంగా కేటీఆర్ హామీ ఇచ్చారు.




