సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల ధర్నా

YSR Praja News : వికారాబాద్: తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, కనీస వేతనం రూ.18,000గా నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

లెప్రసి సర్వే, పల్స్ పోలియో కార్యక్రమం, సర్పంచ్ ఎన్నికల సమయంలో చేసిన విధులకు సంబంధించిన బకాయిలు ఇప్పటికీ విడుదల కాకపోవడం అన్యాయమని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆశాలపై భారం మోపుతున్న ఆన్లైన్ సర్వే పనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ ధర్నాలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కే. శ్రీనివాస్, జిల్లా కోశాధికారి బుస్సా చంద్రయ్య మాట్లాడుతూ…

2022 నుంచి 2025 వరకు రాష్ట్రవ్యాప్తంగా లెప్రసి సర్వే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. వికారాబాద్ జిల్లాలో ఆశా కార్యకర్తల చేత 15 రోజులపాటు సర్వే చేయించారని, రోజుకు రూ.70 చొప్పున చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే సర్వే పూర్తై ఏడాది గడిచినా ఇప్పటివరకు డబ్బులు జమ చేయలేదని ఆరోపించారు.

జిల్లాలోని 20 మండలాల్లో పనిచేసిన ఆశా కార్యకర్తలకు ఒక్కొక్కరికి రూ.1,050 చొప్పున బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. స్థిర వేతనం లేకుండా, అదనపు పనిభారంతో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు పారితోషకాలు ఇవ్వకుండా ఆలస్యం చేయడం అన్యాయమని అన్నారు.

అదేవిధంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆశా కార్యకర్తలకు ప్రత్యేక విశ్రాంతి గదులు లేవని పేర్కొన్నారు. గర్భిణీలను డెలివరీ కేసుల కోసం తీసుకువచ్చిన సందర్భాల్లో రెండు నుంచి మూడు రోజుల వరకు ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తోందని, వసతి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున వెంటనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆశాల కోసం ప్రత్యేక విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని, ఈఎస్‌ఐపీఎఫ్ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, తెలంగాణ వాలంటరీ అండ్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) జిల్లా అధ్యక్షులు అమృత, జిల్లా కార్యదర్శి మంగమ్మతో పాటు ఉమా, పద్మ, అనురాధ, అరుణ, కౌసల్య, జగదేవి, మునిబాయి, లక్ష్మి, మధులత, సుజాత, శ్రీదేవి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *