YSR Praja News Telugu : తాండూర్:భారత రాజ్యాంగ నిర్మాత, అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై ఆర్‌ఎస్‌ఎస్ డైరెక్షన్, బీజేపీ ప్రోద్బలంతోనే విష ప్రచారం, ముప్పేట దాడి జరుగుతున్నాయని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ ఆరోపించారు. రాజ్యాంగాన్ని, అంబేద్కర్‌ను అవమానిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. కేవీపీఎస్, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సోమవారం తాండూర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వికారాబాద్ జిల్లా వ్యాప్త నిరసన కార్యక్రమం నిర్వహించారు.
’మనువాద ప్రమాదాన్ని ఐక్యంగా తిప్పికొట్టాలి’
ఈ సందర్భంగా ఉప్పలి మల్కయ్య, కె. శ్రీనివాస్ మాట్లాడుతూ.. బాబాసాహెబ్ అంబేద్కర్ కోట్లాది మంది అణగారిన ప్రజలకు ఆత్మగౌరవం, సమానత్వం, సామాజిక న్యాయం అందించిన చారిత్రక మహనీయుడని కొనియాడారు. రాజ్యాంగ నిర్మాణంలో ఆయన పోషించిన పాత్రను వక్రీకరించి, ‘కల్పిత నాయకుడు’ అని చిత్రీకరించడం రాజ్యాంగ విలువలను అవమానించడమేనని మండిపడ్డారు. దేశంలో అట్టడుగు పేదల ఐక్యతకు బీజేపీయే ప్రధాన ఆటంకంగా నిలుస్తోందని, నాగపూర్ కేంద్రంగా ఆర్‌ఎస్‌ఎస్ మనువాద కుట్రలు పన్నుతోందని విమర్శించారు.
రాజ్యాంగ విలువల పరిరక్షణకు పిలుపు
ఢిల్లీలో జరిగిన ‘జంజీ’ ఉద్యమంలో విద్యార్థులు, యువకులు రాజ్యాంగ ప్రతులు, అంబేద్కర్ చిత్రపటాలు చేతబూని ఉద్యమించారని, దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ చైతన్యాన్ని అణచివేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని నేతలు పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లు ఎత్తివేయాలనే దురాలోచనతో సాగుతున్న విష ప్రచారాన్ని దళితులు, బహుజనులు, ప్రజాస్వామ్యవాదులు ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
అంబేద్కర్‌పై దుష్ప్రచారం, అవమానకర వ్యాఖ్యలు చేసేవారిపై ప్రభుత్వం, పోలీసులు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలు, రాజ్యాంగ ప్రతులను అవమానించే చర్యలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో అంబేద్కర్ జీవిత చరిత్ర, రాజ్యాంగ విలువలు, సామాజిక సమానత్వంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. అంబేద్కర్, రాజ్యాంగం జోలికొస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
పాల్గొన్న ముఖ్య నాయకులు:
ఈ నిరసన కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు యు. బుగ్గప్ప, టిఎస్ఎంహెచ్‌పిఎస్ తాండూర్ ఇన్‌చార్జ్ సాధిక్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల పోరాట సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రయ్య, కేఎన్‌పీఎస్ జిల్లా నాయకుడు గుమ్మడి రత్నం, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు మహేందర్, కేవీపీఎస్ నాయకులు పిట్ల నర్సిములు, వెంకటయ్య, బాలరాజ్, మొగుళప్ప, చంద్రమ్మ, అంజిలమ్మ, డి. నర్సిములు తదితరులు పాల్గొన్నారు.




